నిర్మల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : నిర్మల్ జిల్లాలోని అడవిలో దారితప్పిన మహిళలను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్లమీది లక్ష్మి, బత్తుల సరోజా అనే నలుగురు తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో చిక్కుకుపోయారు. అయితే రాత్రి ఇంటికి చేరకపోవడంతో ఆ గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ విషయం నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల దృష్టికి వెళ్లింది. తక్షణమే ఆమె స్పందించి మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఆ నలుగురు ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
మహిళలు తప్పి పోయిందిలా…
అడవులకు సమీపంలో ఉన్న మహిళలు సాయంత్రం వేళ తునికాకు సేకరణకు వెళుతుంటారు. పగలంతా రాలిన ఆకులను మహిళలు సేకరించి, వాటిని శుభ్రం చేసి కట్టలుగా కడుతుంటారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్లమీది లక్ష్మి, బత్తుల సరోజా వెళ్లారు. రెండు, మూడు గంటల తర్వాత ఇంటికి చేరాల్సి ఉండగా, రాత్రి ఎనిమిది వరకు చేరలేదు. ఆయా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ జానకి షర్మిల స్వయంగా రంగంలోకి దిగారు. అడవిలో తప్పిపోయిన వారి జాడను శుక్రవారం ఉదయం భీమన్న గుట్ట వద్ద వారి ఆచూకీ కనుగొన్నారు. ఈ బృందాలకు ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా పర్యవేక్షించారు.
ఇలాంటి పరిస్థితుల్లో మేముంటాం : ఎస్పీ
అడవి సమీప గ్రామస్థులకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, తామంతా మీకు అండగా ఉంటామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అడవిలోకి వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఈ ఆపరేషన్‌లో సహకరించిన ఏఎస్పీ రాజేష్ మీన, ఇన్ స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, ఆర్ఐలు శేఖర్, రమేష్, ఎస్ఐలు, ఆర్.ఏసీ లను అభినందించారు. టీం లో పాల్గొని ఉదయం నుండి వెతికి పట్టుకున్న స్పెషల్ పార్టీ, అన్ని ఉమెన్ స్పెషల్ పార్టీ శివంగి బృందాలను ఎస్పీ అభినందించారు.