పోలీస్ గ్రీవెన్స్‌కు 101 ఫిర్యాదులు…

పోలీస్ గ్రీవెన్స్‌కు 101 ఫిర్యాదులు…

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 101 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.

ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోసాలు, భూమి వివాదాలే అధికం వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా మోసపూరిత వ్యవహారాలు, భూమి వివాదాలకు సంబంధించినవే ఉండటం గమనార్హం. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఇద్దరు మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.1.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కర్నూలు శరీన్‌నగర్‌కు చెందిన యశోద, నందిని ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చినప్పటికీ ఇంకా బాకీ ఉందని చెప్పి ఒక ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నాడంటూ గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన ఎర్రగిడ్డయ్య ఫిర్యాదు చేశారు.

లోన్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారని బండిమెట్టకు చెందిన షేక్ ఫాతిమా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకున్నాడని కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్ ఫిర్యాదు చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ చిదంబరరావు స్ట్రీట్‌కు చెందిన భరత్ ఫిర్యాదు చేశాడు.

ఆన్‌లైన్, పెట్టుబడి మోసాలపై ఫిర్యాదులు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు ‘సేవ్ ఎర్త్ మనీ’ పేరిట ప్రకటన ఇచ్చి ల్యాప్‌టాప్‌లు ఇచ్చి, క్యాంటీన్‌లు ఏర్పాటు చేయించి నెలకు రూ.20 వేలు జీతం ఇస్తామని నమ్మబలికి సుమారు 80 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.12,500 చొప్పున మొత్తం రూ.18 లక్షలు మోసం చేసినట్లు పెద్దకడుబూరు మండలం బసలదొడ్డి గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఆక్రమణలు, గొడవలపై వినతులు ఆదోని కార్వన్‌పేటకు చెందిన లక్ష్మీ తమ స్థలాన్ని ఆక్రమించి గొడవలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

త్వరిత చర్యలకు ఆదేశాలు వచ్చిన అన్ని ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Leave a Reply