Vice Chairman | టీడీపీదే పిడుగురాళ్ల‌…. తుని మాత్రం మ‌రోసారి వాయిదా

వెల‌గ‌పూడి, ఆంధ్ర‌ప్ర‌భ : గ‌తంలో వాయిదా ప‌డిన తుని, పిడుగ‌రాళ్ల మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌వుల‌కు ఇవాళ‌ ఎన్నిక‌లు అధికారులు నిర్వ‌హించారు.. అయితే తునిలో ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన‌డంతో అక్క‌డ ఎన్నిక మరోసారి వాయిదా ప‌డింది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పురపాలక సమావేశానికి మొత్తంగా 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఉన్నం భారతిని కౌన్సిలర్ ప్రతిపాదించగా మిగిలిన కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

తుని ఎన్నిక మ‌రోసారి వాయిదా..
మరోవైపు తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మ‌రోసారి వాయిదా ప‌డింది.. ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో నేడు ఈ ఎన్నిక నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను నోటిఫికేష‌న్ జారీ చేశారు. నేటి ఉద‌యం కౌన్సిల్ హాల్ వ‌ద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సమావేశానికి వ‌చ్చిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేత దాడి శెట్టి రాజా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తుని మున్సిపల్‌ కార్యాలయానికి 10మంది టీడీపీ కౌన్సిలర్లు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇరువ‌ర్గాల‌ను పోలీసులు అదుపుచేశారు. అయితే స‌మావేశం లోప‌ల‌కి వెళ్ల‌కుండా వైసీపీ నేత‌లు అడ్డుప‌డ‌టంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *