హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు నేడు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను విచారిస్తున్నది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అలాగే ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు.
మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చిన ఆయన నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు.. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది