నిర్మల్ ప్రతినిధి, కుంటాల మే 15 (ఆంధ్రప్రభ ) : భూభారతి చట్టం అమలుతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూభారతి చట్టాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేసిన కుంటాల మండలంలోని మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి.అనసూయ సీతక్క, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులకు అధికారులు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజల భూ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలు సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకువస్తామన్నారు. భూ భారతి చట్టం అమలుతో రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాల్లోకి వచ్చి, గ్రామ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల ప్రజల భూ సమస్యల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వారి భూ సమస్యలకు సంబంధించి భూభారతి చట్టాన్ని అనుసరించి పరిష్కార మార్గాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు మాట్లాడారు.
కుంటాల మండలంలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా స్వీకరించిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించిన దరఖాస్తుదారులకు మంత్రులు అధికారుల చేతుల మీదుగా సంబంధిత పత్రాలను అందజేశారు. కడెం మండలంలోని పునరావాసిత గ్రామాలైన రాంపూర్, మైసంపేట్ గ్రామ ప్రజలకు పంపిణీ చేసిన భూములకు సంబంధించి యాజమాన్య హక్కు పత్రాలను అందజేశారు.
ఈకార్యక్రమంలో కలెక్టర్ లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, ముధోల్, ఖానాపూర్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, బైంసా, నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఆనంద్ రావు పటేల్, భీమ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.