Peddapalli Rural | పెంపుడు శునకం ఎత్తు బంగారం

Peddapalli Rural | పెంపుడు శునకం ఎత్తు బంగారం
- సమ్మక్క – సారక్కకు శునకం ఎత్తు బంగారం మొక్కుబడి
Peddapalli Rural | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రతి రెండేళ్లకోసారి కుంభమేళాను తలపించేలా మేడారం సమ్మక్క – సారక్క జాతర జరగడం, భక్తులు లక్షలాదిగా తరలివెళ్ళి బంగారం, మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే ఇక్కడ ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తన పెంపుడు కుక్కను కుటుంబంలో ఒకరిగా చూసుకునే శ్రీమాత డెవలపర్స్ చైర్మన్ కాసర్ల రాజు తన ప్రాణ సమానమైన పెంపుడు శునకం ఆరోగ్యం కుదుటపడాలని సమక్క – సారక్క అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బంగారంలా భావించే బెల్లం ) సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు.
ఈ విచిత్ర సంఘటన ఇవాళ పెద్దపల్లి పట్టణంలో జరిగింది. కాసర్ల రాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క భైరవకు గత నెల సుస్తీ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఏమీ తినకుండా అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో అతనికి ఏమి తోచక సమ్మక్క – సారక్క దేవతలకు మొక్కుకున్నాడు.
కుక్క ఆరోగ్యం కుదుట పడితే జాతర సమయంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తానని సమ్మక్క – సారక్క దేవతలకు మొక్కులు మొక్కుకున్నాడు. మొక్కిన వెంటనే భైరవకు ఆరోగ్యం కుదుటపడింది. మొక్కు నెరవేరింది కాబట్టే.. తన కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించానని రాజు తెలిపాడు.
మూగ జీవాల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిఎంఓ కోట మల్లేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సభ్యులు, బొడ్డు సుమన్, బొడ్డుపల్లి రవి, బండ రాజయ్య, కొమరిశెట్టి శ్రీనివాస్, ఓరుగంటి శ్రీధర్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
