passes away | ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత..

passes away | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రముఖ టీవీ, సినీ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ గుండెపోటుతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. టీవీ ధారావాహికలకు సంగీతం అందించిన ఆయన పలు నంది అవార్డులను అందుకున్నారు. రెండున్నర దశాబ్దాలపాటు టీవీ, రేడియో రంగాలతో పాటు చిత్రసీమలోనూ సంగీత దర్శకుడిగా రాణించిన నల్లూరి సుధీర్ కుమార్ గురువారం ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ దూరదర్శన్ తొలినాళ్ళలో సుధీర్ కుమార్ అందులో వందలాది పాటలను స్వరపర్చారు.

టీవీ ధారావాహికలకు, స్పెషల్ ఎపిసోడ్స్ కు సంగీతం అందించిన సుధీర్ కుమార్ ఎన్నో నంది అవార్డులను అందుకున్నారు. పలు చిత్రాలకూ ఆయన సంగీతం అందించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అగ్ని ప్రవేశం’కు ఆయనే సంగీత దర్శకుడు. అలానే తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన ‘కూతురు’, ‘అమ్మో అల్లుడా’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు.

2024లో తారకరత్న హీరోగా నటించిన ‘ఎస్ -9’ ఆయన సంగీతం సమకూర్చిన చివరి చిత్రం. మచిలీపట్నం మల్కాపట్నంకు చెందిన సుధీర్ కుమార్ నోబుల్ కళాశాల పూర్వ విద్యార్థి యుక్తవయసులోనే హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నల్లూరి సుధీర్ కుమార్ మృతికి పలువురు టీవీ, సినీరంగాలకు చెందిన వారు సంతాపం తెలిపారు.

Leave a Reply