Parakala | బస్టాండ్ ప్రాంతంలో..

Parakala | బస్టాండ్ ప్రాంతంలో..
- రోడ్లను ఆక్రమించి పండ్ల వ్యాపారాలు
- బస్టాండ్ లోకి బస్సు వెళ్లే దారిలో మూలల వద్ద పండ్ల షాపులు
- మూడు రోజుల క్రితం వృద్ధురాలు బస్సు ఢీకొని మృతి
- రోడ్లను ఆక్రమించిన పండ్ల వ్యాపారాల వల్లనే ప్రమాదాలు
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి పండ్ల వ్యాపారాలు నిర్వహించడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరకాల బస్టాండ్ కు బస్సులు లోనికి, బయటకి వెళ్లే మూలల (కార్నర్) వద్ద పండ్ల షాపులు రోడ్లని ఆక్రమించి నిర్వహించడం జరుగుతుంది. పాదచారులు ఈ పండ్ల షాపుల పక్కనుండి వెళ్లే క్రమంలో బస్సులను నడిపే డ్రైవర్లకు పండ్ల షాపులు తప్ప కాలి నడకనా వెళ్లేవారు కనిపించకపోవడం ప్రమాదాలకు కారణమవుతుంది.
గత సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం ములుగు మండలం పల్సపల్లి గ్రామానికి చెందిన తోట రాధమ్మ పరకాల బస్టాండ్ వద్ద బస్సు లోనికి వెళ్లే మూలమలుపు దాటుతున్న క్రమంలో బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా బస్టాండు లోనికి, బయటకు వెళ్లే బస్సులు మూల మలుపుల వద్ద గతంలో పాదచారులు ప్రమాదానికి గురైన సంఘటనలున్నాయి. ఈ మూలమలుపుల వద్ద రోడ్లను ఆక్రమించి పెట్టిన పండ్ల షాపుల వల్ల పాదచారులు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూల మలుపుల వద్ద ప్రమాదాలకు కారణమయ్యే పండ్ల షాపులను తొలగించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
