Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra Prabha News

Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra Prabha News
పాక్ అసలు ప్లాన్ ఇదేనా?
- దృష్టి మళ్లించే ప్రయత్నం
- సీపెక్ భద్రతపై చైనా ఆందోళన
- కాబూల్‌లో వైద్యం, ఆహార సంక్షోభం తీవ్రతరం
- సరిహద్దులు మూసివేతతో జనం అష్టకష్టాలు
- యుద్ధం వెనుక అసలు నిజాలు
- ప్రపంచాన్ని మోసం చేస్తున్నారా?
- కాబూల్ దాడిపై సంచలన విశ్లేషణ
- టిటిపి, చైనా, అమెరికా పాత్ర ఎంత?
( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్ )

మరి కొన్ని రోజుల్లోనే ఇరాన్ లొంగి పోతుంది. యుద్ధం ముగుస్తుంది. అని అమెరికా అధ్యక్షుడు గండెడాశల వంటకం చేస్తుంటే… అకస్మాత్తుగా పాకిస్థాన్ దారుణ మారుణ హోమాన్ని సృష్టించింది. మాదక ద్రవ్యాల రక్కసుల సేరుతో.. కాబూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రగ్ ఎడిక్ట్ రోగుల సంహారానికి పూనుకుంది. కాబూల్ లోని అత్యంత పెద్దాసుపత్రిపై బాంబుల కురిపించింది. ఆసుపత్రిని ధ్వంసం చేసింది. అదే మని ప్రశ్నిస్తే.. తాము సైనిక స్థావరాలపై దాడి చేశామని, ఆసుపత్రిపై కాదని వాదిస్తోంది. అదే మంటే.. అదే ఆసుపత్రిలో డ్రగ్స్ మాఫియాకు ఆశ్రయం కల్పించారని, అందుకే దాడి చేశానని వివరణ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది.

ఒక వైపు ఇజ్రో అమెరికా ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీతో పశ్చిమాసియా రగిలిపోతుంటే.. ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో కోరుతుంటే.. మరో వైపు హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సంగతి తేల్చేద్దామంటూ మిత్ర దేశాలను యుద్దానికి అమెరికా ఆహ్వానిస్తే.. అబ్బే యుద్ధం వద్దు అంటూ జపాన్, ఆస్ట్రేలియా సెలవివ్వగా… అకస్మాత్తుగా.. అనూహ్యంగా.. ఆప్థగనిస్థాన్ పై పాకిస్థాన్ విరుచుకు పడటానికి కారణాలేంటీ? పశ్చిమాసియా యుద్ధ వాతావారణం నుంచి ప్రపంచం దృష్టి మరల్చటమా?

సొంతింటిలో కుంపటిని పక్కదారి పట్టించటమా? ఆప్ఘనిస్థాన్ నేలలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న అమెరికాను ఆకట్టుకోవటానికా? ఇంతకీ ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ ఎందుకు దాడి చేసింది. ఇంత ఘోర పాతకాన్ని ఎందుకు మూటగట్టుకుంది? ఇవీ సాధారణ ప్రపంచ జనాన్ని వేధిస్తున్న ప్రశ్నలు. పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఈ ఘర్షణల వెనుక లోతైన అంతర్జాతీయ రాజకీయ కోణాలు , వ్యూహాత్మక అంశాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Pak Diversion Game : తాలిబన్ తో తగువేంటీ ?

తెహ్రిక్- ఇ -తాలిబాన్ పాకిస్థాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్ ను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఈ టీటీపీకి ఆశ్రయం ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ గడ్డపై ఈ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులు ప్రారంభించింది. . ఫిబ్రవరి 2026లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా, ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు పాక్ సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించాయి.

ఇది రెండు దేశాల మధ్య “నేరుగా యుద్ధం” (Open War) వాతావరణానికి దారితీసింది. సరిహద్దు వివాదం (Durand Line): బ్రిటీష్ కాలం నాటి డ్యూరాండ్ లైన్ ను అధికారిక సరిహద్దుగా గుర్తించడానికి ఆఫ్ఘనిస్థాన్ నిరాకరిస్తోంది. ఈ సరిహద్దు వెంబడి కంచె వేసే అంశాలపై ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.
Pak Diversion Game : ప్రపంచ దృష్టి మళ్లింపు

పశ్చిమాసియాలో (ఇజ్రాయెల్-గాజా, లెబనాన్) ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, దక్షిణ ఆసియాలో తాజా దాడులు గమనార్హం. పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశీయంగా పెరుగుతున్న అసంతృప్తి రాజకీయ అస్థిరత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి సైనిక చర్యలను ప్రభుత్వం ప్రయోగించటం సర్వసాధారణం.

ఇక ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత, అక్కడ తాలిబాన్ల ప్రభావం పెరిగింది. ఇది అమెరికాకు ఆందోళన కలిగించే విషయం. పాకిస్థాన్ ద్వారా తాలిబాన్లను నియంత్రించడం లేదా అక్కడ ఉగ్రవాద స్థావరాలను (TTP) దెబ్బతీయడం వల్ల పరోక్షంగా అమెరికా ప్రయోజనాలు నెరవేరుతాయి. అందుకు పాకిస్థాన్ కు అమెరికా వత్తాసు పలుకుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు తన ఆత్మరక్షణ హక్కు ఉందని అమెరికా పేర్కొంది. పౌర ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది.
Pak Diversion Game : చైనా చిర్రు బుర్రు

చైనా పాకిస్థాన్‌లో భారీ పెట్టుబడులు (CPEC) పెట్టింది. ఆఫ్ఘన్ సరిహద్దుల నుంచి వచ్చే ఉగ్రవాదులు చైనీస్ ఇంజనీర్లపై దాడులు చేస్తున్నారు. ఈ టీటీపీ చర్యతో చైనాకు ఇబ్బంది తప్పటం లేదు. ఈ దాడుల వెనుక ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే చైనా ఒత్తిడి కూడా ఉంది. కానీ. హోర్ముజా జలసంధి విషయంలో ఇరాన్ పై దాడికి నౌకలను సిద్ధం చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆప్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ దాడి జరపటంతో చైనా జీర్ణించుకోలేకపోతోంది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాల ఆత్మీయ చైనా కోరింది.
Pak Diversion Game : ఆధిపత్యం.. ఆరాటం
పాకిస్థాన్ ఎప్పుడూ ఆఫ్ఘనిస్థాన్‌ను తన “వ్యూహాత్మక లోతు” (Strategic Depth) గా భావిస్తుంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ధబాంధవ్యాలను అడ్డుకోవడానికి పాకిస్థాన్ ఇటువంటి ఒత్తిడి తంత్రాన్ని అనుసరిస్తుంటుంది.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాము చెప్పినట్లు వినని తాలిబాన్ ప్రభుత్వానికి, తమ సైనిక శక్తిని ప్రదర్శించడం ద్వారా పాకిస్థాన్ ఒక బలమైన హెచ్చరిక పంపాలని భావిస్తోంది.
పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా యూరోప్ దేశాలు బిజీగా ఉన్న సమయంలో.. పాకిస్థాన్ ఈ దాడులను తీవ్రతరం చేయడం ద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా అభ్యంతరాలు రాకుండా చూసుకునే వ్యూహం ఉండవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఈ దాడులను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారంపై పాకిస్థాన్ జరిపిన మరో దురాక్రమణ చర్య గా అభివర్ణించింది.
Pak Diversion Game : ప్రపంచ దేశాలు గరం గరం

కాబూల్ ఆసుపత్రిపై జరిగిన దాడి మరియు కొనసాగుతున్న ఘర్షణలపై అంతర్జాతీయ సమాజం నుండి వచ్చిన ప్రధాన ప్రతిస్పందనలు ఇక్కడ ఉన్నాయి . ఇరు దేశాల మధ్య తక్షణమే కాల్పుల విరమణ జరగాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ఈ దాడులతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు పిల్లలు బలికావడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే, ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు తాలిబాన్ పాలకులు మరిన్ని చర్యలు తీసుకోవాలని భద్రతా మండలి కోరింది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ & రష్యా, ఇరాన్ ప్రకటించాయి . ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాయి.
Pak Diversion Game : అత్యంత దయనీయం

కాబూల్ ఆసుపత్రిపై జరిగిన దాడి తర్వాత అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయంగా మారింది. కాబూల్‌లోని అతిపెద్ద డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ ధ్వంసం కావడంతో, అక్కడ చికిత్స పొందుతున్న వందలాది మంది రోగులు రోడ్లపైకి వచ్చారు. గాయపడిన 250 మందికి చికిత్స అందించడానికి స్థానిక ఆసుపత్రులు సరిపోవడం లేదు. మందులు, రక్తం మరియు అత్యవసర పరికరాల కొరత తీవ్రంగా ఉంది.
రాజధాని నగరంపైనే నేరుగా దాడులు జరగడంతో కాబూల్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ వైమానిక దాడుల వల్ల కేవలం ఆసుపత్రే కాకుండా, చుట్టుపక్కల ఉన్న నివాస గృహాలు కూడా దెబ్బతిన్నాయి, దీనివల్ల వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ మధ్య ప్రధాన వాణిజ్య మార్గాలు టోర్ఖమ్ (Torkham) చమన్ (Chaman) సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. దీనివల్ల వేలాది ట్రక్కులు నిలిచిపోయి, ఆహార పదార్థాలు కుళ్ళిపోయే స్థితి ఏర్పడింది. సరిహద్దు వెంబడి ఇరు దేశాలు తమ భారీ ఆయుధాలను, ట్యాంకులను మరియు అదనపు బలగాలను మోహరించాయి. ఎప్పుడైనా పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని సరిహద్దు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. సరిహద్దులు మూసివేయడంతో పాకిస్థాన్‌లో చిక్కుకున్న ఆఫ్ఘన్ పౌరులు తిరిగి వెళ్లలేక, సరిహద్దుల వద్దే నానా ఇబ్బందులు పడుతున్నారు.
ALSO READ : 400 Dead Kabul Hospital : మారణహోమం Andhra Prabha News
