జన్నారంరూరల్, మే 12 (ఆంధ్రప్రభ): అడవులు, పోడు భూములపై అనాదిగా ఆదివాసులకే హక్కులు ఉన్నాయని, గతంలో ఆదివాసీ నేతలు చాలా పోరాటాలు చేశారని రాష్ట్ర ఎమ్మెల్సీ ముద్దసాని కోదండరాం అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని హరిత రిసార్ట్ లో ఉమ్మడి జిల్లాల్లోని ఆదివాసీ ప్రతినిధుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన సోమవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూమికోసం, విముక్తి కోసం ఆదివాసులు తెగించి కొట్లాడారన్నారు. ఆదివాసుల కోసం పేసా చట్టాన్ని తీసుకువచ్చారని, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని ఆయన తెలిపారు. హక్కుల కోసం ఆదివాసీలంతా చైతన్యవంతులు కావాలని, రాజకీయ, విద్యా పరంగా అన్ని రంగాల్లో ఆదివాసులు ముందున్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు.
ఆదివాసీల ప్రాంతాల్లో చాలా సమస్యలు ఇప్పటికీ ఉన్నాయని, వాటిని పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ… మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం ఏఐసీసీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారన్నారు. ఆదివాసీల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూ, హక్కులను కాపాడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ కన్వీనర్ రాహుల్ బాల్, రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ప్రోగ్రాం క్యాంపు ఇన్చార్జి రానాప్రతాప్, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.కోటియానాయక్, రాష్ట్ర నాయకులు మల్లేశ్వరి, శ్రీకాంత్, శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, వైస్ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, పార్టీ గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు అజ్మీర నందునాయక్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పార్టీ సీనియర్ నేతలు జి.మోహన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, ముత్యం రాజన్న, మచ్చ శంకరయ్య, దాముక కరుణాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు సోహెల్ షా, అజ్మత్ ఖాన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాసరి గణేష్, ఉపాధ్యక్షుడు మహేష్, ముత్యం సతీష్, లక్షెట్టిపేట మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, రాజన్న యాదవ్, సుధీర్ కుమార్, సుధాకర్ నాయక్, గంగన్నయాదవ్, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, మౌలానా, ఇందన్న, హజార్, సాగర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.