- మందారం, ఎర్రకలువ, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన…
- వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు…
- దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు…
- ఇంద్రకీలాద్రిపై వెల్లి విరుస్తున్న ఆధ్యాత్మిక శోభ…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మ వారికి కన్నుల పండుగగా పుష్పార్చన జరుగుతుంది. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకల్లో భాగంగా అమ్మవారికి నిర్వహించే వసంత నవ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గత నెల 30వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఏప్రిల్ ఏడవ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కనకదుర్గమ్మ వారికి వివిధ రకాల పూజలతో ప్రత్యేక పుష్పార్చనను సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో ప్రతిరోజూ జరుగుతున్న ఈ పుష్పార్చనలో భాగంగా నాల్గవ రోజు బుధవారం కనకదుర్గమ్మ వారికి మందార పూలు, ఎర్రకలువలు, మల్లెపూలు, ఇతర ప్రత్యేక పుష్పాలతో అర్చనలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజ మండపంలో అశేష సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య పుష్పార్చనను వేద పండితులు నిర్వహించారు.
ముందుగా ప్రధాన ఆలయం నుండి పుష్పాలను అర్చకులు, అధికారులు అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టల్లో పుష్పాలను తీసుకువచ్చి అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పుష్పార్చనను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లి విరుస్తోంది.