- గాలి సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష
- సబితాఇంద్రారెడ్డికి ఊరట
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును ప్రకటించింది. దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని దోషులుగా, ఇద్దరు నిర్దోషులుగా తేల్చింది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్ధన్ రెడ్డి, బివి శ్రీనివాస రెడ్డి, మెఫాజ్ అలీ ఖాన్, అలాగే అప్పటి గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న విడి రాజగోపాల్ లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. గాలి జనార్ధన్ రెడ్డి, బి.వి. శ్రీనివాస రెడ్డిలకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు ఈ కేసు సంచలనం సృష్టించింది. కాగా, ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. ఆమెపై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాకుండా, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
2009 డిసెంబర్ 7న కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు, ఆ తర్వాత 2011లో చార్జిషీట్ దాఖలు చేశారు. అక్రమ మైనింగ్, ఎగుమతి చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.844 కోట్ల విలువైన ప్రజా నిధులను దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు.