NZB | అరచేతిలో వైకుంఠం చూయిస్తుండ్రు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరచేతిలో వైకుంఠం చూయిస్తూ ఇదే మా పరిపాలన అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు సంగతి దేవుడెరుగు కానీ కాంగ్రెస్ పాలన పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసరడం హాస్యాస్పదమన్నారు.
కాంగ్రెస్ 14 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని చర్చకు రావాలని సీఎంను మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తుకు ఈ మండలి ఎన్నికలు దిశా నిర్దేశం చేయనున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 420 సబ్ గ్యారంటీలలో కొంత మేరకైనా అమలు చేసి బహిరంగ చర్చకు వస్తే బాగుంటుందన్నారు.
అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు వెంటనే అమలు చేస్తామని గొప్పలు చెప్పి… ప్రభుత్వం ఏర్పడి 400 రోజులు పూర్తి కావస్తున్న ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు.
అందుకే శాసనమండలిలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై నిలదీయాలంటే తెలంగాణ సమాజం భారతీయ పార్టీని ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.