Nomination | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో…

Nomination | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో…
Nomination | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ దాఖలు కేంద్రాన్ని బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, చౌటుప్పల్ ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి పరిశీలించారు. రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా మొదటి రోజు నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించి ఎంతమంది అభ్యర్థులు, ఏయే వార్డుల నుండి నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వార్డుల వారీగా వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను తీసుకునేటప్పుడు నిబంధనలలో పేర్కొన్న అన్ని పత్రాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని స్పష్టంగా పరిశీలించాలని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ పత్రాలను స్వీకరించాలని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఐ జి మన్మధ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ బి వీరాబాయి తో పాటు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు కొంతమంది మొదటిరోజు తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు.

