NLGD | ఎస్సీ బాలుర హాస్టల్‌ను దత్తత తీసుకోవాలి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శనివారం రాత్రి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని పలు రకాల రిజిస్టర్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. 60 మంది విద్యార్థుల్లో 12 మంది రెగ్యులర్‌గా గైర్హాజరు కావడం పై వార్డెన్ అశోక్‌ను ఎమ్మెల్యే మందలించారు.
ఈ సందర్భంగా మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, వంటలు రుచికరంగా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వసతి గృహ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రి భోజనం, వంటలు, సరుకులను పరిశీలించారు. మెనూ చార్ట్‌ను కూడా స్వయంగా పరిశీలించారు.
తరువాత జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ఫోన్‌లో మాట్లాడి, వసతి గృహంలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాల్సిందిగా కోరారు. గత 4 నెలలుగా కాస్మెటిక్స్ బిల్లులు విడుదల కావడం లేదని తెలిపారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని కలెక్టర్ చెప్పడంతో, తాను కూడా ఇదే హాస్టల్లో ఉండి చదువుకున్నానని, ఈ హాస్టల్‌కు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇక్కడి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు.
ఈ వసతి గృహాన్ని దత్తత తీసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పి. వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుండగొని రామచంద్రుగౌడ్, ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు, బయ్యని రాజు తదితరులు పాల్గొన్నారు.
