Telangana | జాతీయ స్థాయి కీలక ఖనిజాభివృద్ధి కమిటీలో సింగరేణి
Telangana | శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కీలక ఖనిజాలను గుర్తించడం, అన్వేషణ ఉత్పత్తి కోసం జాతీయ స్థాయి కమిటీ (national-level committee) ని నీతి ఆయోగ్ (NITI Aayog) నవంబర్ 19వ తేదీన నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్ గా ఐఐటి- ఐ ఎస్ ఎం సంస్థ అడ్వైజర్ (మినరల్స్ ) డాక్టర్ డీకే సింగ్ ను, కమిటీ సభ్యులుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ (ఐ.ఎం.ఎం.టి) డైరెక్టర్, సింగరేణి (Singareni) సంస్థ ఛైర్మన్ తో పాటు నైవేలీ లిగ్నైట్ కంపెనీ, కోల్ ఇండియా, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల ఛైర్మన్ లు ఇంకా పలు పరిశ్రమల విభాగాల్లో మరో ఆరుగురిని సభ్యులుగా నియమించారు.
ఈ కమిటీ ఉద్దేశాన్ని నీతి ఆయోగ్ (NITI Aayog) వివరిస్తూ 21వ దశాబ్దంలో కీలక ఖనిజాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్లలోనూ, గనుల్లోనూ, థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్, బాటమ్ యాష్ లోనూ, బొగ్గు సీముల్లో ఉన్న కనీసం 10రకాల కీలక ఖనిజాలను గుర్తించడానికి, దేశంలో కనీసం 20ప్రదేశాల్లో ఉన్న కీలక ఖనిజాల ఉనికిని తెలుసుకొని సత్వరమే అక్కడి శాంపిల్స్ ని పరిశీలించడం, అన్వేషణ జరిపి ఉత్పత్తికి గల అవకాశాలను పరిశీలించడం వంటివి ఈ కమిటీ (committee) అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అధ్యయన నివేదికను ఏడాదిలోగా సమర్పించాలని పేర్కొంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను మరింత ప్రోత్సహించే విధంగా ఈ కమిటీ చురుకుగా పనిచేయాలని సూచించింది.

