Nandyala | ఘనంగా నాలుగవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…

Nandyala | ఘనంగా నాలుగవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…
- అమ్మవారికి కాణిపాకం దేవస్థానం వారు పట్టు వస్త్రాల సమర్పణ..
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో కైలాసగిరిగా వెలుగొందుచున్న శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నాలుగు రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి. తరువాత యాగశాల యందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. అదే విధముగా ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించబడుతాయన్నారు.

- మయూర వాహనసేవ..
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా బుధవారం సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ జరిపించబడుతుందని ఆలయ కార్యనిర్వాకులు శ్రీనివాసరావు చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు తెలిపారు. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడుతాయన్నారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరుగనున్నది. గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేశా మన్నారు ……

- మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలోని అమ్మవారికి..
- కాణిపాక దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ…
నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో అరవలింగమైన శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, కాణిపాకం వారు బుధవారం ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. కాణిపాక దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మణినాయుడు, కార్యనిర్వహణాధికారి కె. పెంచలకిషోర్, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు. తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయన్నారు.
అనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వలన ఎంతో ఆధ్యాత్మికానుభూతి కలిగిందన్నారు. కాణిపాక దేవస్థానం తరుపున శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో పలువురు పేద పండితులు అర్చక స్వాములు పాల్గొన్నారు.
