Nadyala | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన…

Nadyala | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన…

శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి…
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలు…

Nadyala | నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన త్రాగునీరు, అల్పాహార పంపిణీ కేంద్రాలు, శానిటేషన్ ఏర్పాట్లు తదితర అంశాలను చివరి వరకు పరిశీలించి, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

శివ స్వాములు విశ్రాంతి తీసుకునే చంద్రావతి కళ్యాణ మండపాన్ని సందర్శించి అక్కడ కల్పించిన సదుపాయాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గుడి వెలుపల ఉన్న క్యూ లైన్ల నుండి అమ్మవారి దర్శనం అనంతరం నిష్క్రమణ వరకు ఏర్పాటైన మార్గాలను తనిఖీ చేసి, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అల్పాహారం, త్రాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భద్రత పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రధాన ద్వారం నుండి దర్శనం అనంతరం నిష్క్రమణ మార్గాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి తెలిపారు.

మహాశివరాత్రి పర్వదినాన భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అదనంగా చేపట్టిన ఏర్పాట్లను కూడా కలెక్టర్, ఎస్పీ పరిశీలించి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. భక్తులు పోలీసు అధికారుల సూచనలను పాటిస్తూ తమ వాహనాలను ఇతరులకు ఆటంకం కలగకుండా నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply