- అదనంగా 5 కి.లో.మీ !!
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు అంబర్‌పేట్ వద్ద మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. రోజురోజుకూ వరద ప్రవాహం పెరగడం వల్ల బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.
అంబర్‌పేట్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే వాహనదారులను దారి మళ్లించారు. మలక్‌పేట నుండి ముసారాంబాగ్ వంతెన మీదుగా అంబర్‌పేట పరిసర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులను కూడా దారి మళ్లించారు.
స్థానికులు ఆవేదన:
మూసారంబాగ్ వంతెనపై వరద నీరు ప్రవహించిన ప్రతిసారీ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైలెవల్ వంతెన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన పనులు మొదలు పెట్టి దాదాపు రెండేళ్లయినా కేవలం 20 శాతమే పూర్తవడం గమనార్హం.
మూసీ నదిపై ముఖ్యమైన ప్రాంతాల్లో 15 వంతెనల నిర్మాణానికి ప్రణాళిక జరగ్గా, కేవలం రెండుచోట్లే పనులు మొదలయ్యాయి. వాటిలో ఓ చోట పనులు అర్ధాంతరంగా నిలిచిపోగా, మిగిలిన ఒక్క పనిని కూడా జీహెచ్‌ఎంసీ సకాలంలో పూర్తి చేయలేక నానా అవస్థలు పడుతోంది.
పనులు నత్తనడకన సాగుతుండడంతో, అంబర్‌పేట్ – మలక్‌పేట్ మధ్య ప్రయాణించే వాహనదారులు చిన్న చినుకు పడినా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనదారులు అదనంగా 5 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.