రాజకీయాలకతీతంగా బెల్లంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా

రాజకీయాలకతీతంగా బెల్లంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా

  • మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి
  • ప్రజలే నా కుటుంబం.. కౌన్సిలర్లే నా కుటుంబ సభ్యులు
  • పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
  • ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో చైర్‌పర్సన్ వెల్లడి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బెల్లంపల్లి మున్సిపాలిటీని జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి పేర్కొన్నారు. అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అహర్నిశలూ కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని శుక్రవారం ‘ఆంధ్రప్రభ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రచారంలో గుర్తించిన ప్రధాన సమస్యలు ఇవే..
ఎన్నికల ప్రచార సమయంలో 7వ వార్డుతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా సుభాష్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తాం. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నాం. 34 వార్డుల్లో సమస్యలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34వార్డుల్లో.. వార్డుల వారీగా సమస్యలను గుర్తించి, నిధుల కేటాయింపు ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతాం. వీటితో పాటు పట్టణానికి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రామ్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తాం. బెల్లంపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ను కాంటా చౌరస్తాకు మార్పించడం, స్థానికంగా ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తాం. విద్యా, ప్రభుత్వ కార్యాలయాలు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ కళాశాలల ఏర్పాటుపై కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో ముందుకు..
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణల సహకారంతో బెల్లంపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. రాజకీయాలకతీతంగా పట్టణ ప్రజలందరినీ నా కుటుంబ సభ్యులుగా, కౌన్సిలర్లను నా తోడబుట్టిన వారిగా భావించి అందరినీ కలుపుకొని పోతాను. మున్సిపాలిటీకి గ్రేడ్-1 స్థాయికి తగ్గట్టుగా వసతులు కల్పించి, అవసరమైన చోట పార్కులు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాం.

పారదర్శక పాలనే లక్ష్యం
నాకు రాజకీయ అనుభవం కొత్త అయినప్పటికీ, నా భర్త దావా రమేష్ బాబు సహకారంతో, ప్రజా ప్రతినిధుల అండతో ప్రజలకు చేరువగా ఉంటాను. గత పాలన కంటే భిన్నంగా, ప్రస్తుతం 34 వార్డులకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధిలో వ్యత్యాసం లేకుండా చూస్తాను. ప్రజలు కూడా ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను.

ప్రజల ముంగిటకే పాలన..
పట్టణ ప్రజలకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాను. పట్టణ అభివృద్ధి అనేది ఒక్కరితో సాధ్యం కాదు; ఇందుకు బెల్లంపల్లి పట్టణ ప్రజలు, కౌన్సిలర్లు మరియు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో కషి చేయాలని ఆమె కోరారు. అందరినీ కలుపుకుని పారదర్శకమైన పాలన అందిస్తానని భరోసా ఇచ్చారు.

ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తా..”
బెల్లంపల్లి మున్సిపాలిటీలోని అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా ప్రత్యేక చొరవ చూపుతామని చైర్‌పర్సన్ దావా స్వాతి పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి లబ్ధిదారునికి చేరడమే లక్ష్యంగా పని చేస్తానని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply