Municipal Chairman | రెండో వార్డు కీలకం..!

Municipal Chairman | రెండో వార్డు కీలకం..!

  • మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయింపు
  • 2వ వార్డు ఎస్సీ మహిళ

Municipal Chairman | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పదవి కాస్త ఎస్సీ మహిళకు కేటాయిస్తూ ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అధికారికంగా ఖరారు చేశారు. మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం గతంలో జనరల్ మహిళకు కేటాయించగా..ప్రస్తుతం ఎస్సీ మహిళకు కేటాయించారు. రొటేషన్ పద్ధ‌తిలో రిజర్వేషన్ పాటించడంతో ఈ దఫా బీసీ, లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు చైర్మన్ పదవి వస్తుందని అంచనాలు వేశారు. అందుక‌నుగుణంగా ఈ సారి ఎస్సీ మహిళ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఇప్పటికే 12 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు సైతం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు ఖరారు చేశారు.

చైర్మన్ రిజర్వేషన్ కాస్త వెల్లడి కావడంతో చైర్మన్ పదవి కోసం ఆశలు పెంచుకున్న బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు నిరాశే మిగిలింది. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో 12 వార్డులలో కేవలం ఒక్క 2వ వార్డు మాత్రమే ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కావడంతో ఆ వార్డులో గెలుపొందిన మహిళ మాత్రమే మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఆ వార్డులో పోటీ సైతం తీవ్రంగా ఉండడంతో పాటు ఆ వార్డ్ మున్సిపల్ ఎన్నికల్లో కీలకం కానుంది. గతంలో ఇదే 2 వ వార్డ్ జనరల్ మహిళకు కేటాయించారు.

Municipal Chairman | మహిళలకు పట్టం….

మోత్కూర్ మున్సిపాలిటీ తొలిసారిగా ఏర్పడగా తొలి విడత చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా… ఈ దఫా ఎస్సీ మహిళలకు కేటాయించారు. దీంతో వరుసగా రెండోసారి మహిళలకు మున్సిపల్ చైర్మన్‌ పీఠం ద‌క్క‌నుంది. మహిళలకు పట్టం కట్టినట్లైంది.

Municipal Chairman | ఆనందోత్సవాల్లో ఎస్సీలు….

మోత్కూర్ గ్రామపంచాయతీ ఏర్పడి సుమారు 70 సంవత్సరాలు కావస్తున్నా ఎస్సి లకు మోత్కూర్ సర్పంచ్ అయ్యే అవకాశాలు రాలేదు.దీంతో ఈ సారి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సి మహిళకు రిజర్వ్ కావడంతో ఎస్సి సామాజిక వర్గాల్లో ఆనందం నిండుకుంది.

Leave a Reply