Municipal | ఎన్నికల పోలింగ్ కేంద్రంలో స్వీయ చిత్రీకరణ

Municipal | ఏర్గట్ల, ఆంధ్రప్రభ : పోలింగ్ విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయురాలు నిబంధనల ను ఉల్లంఘించి తన చారవణిలో బ్యాలెట్లు స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియా స్టేటస్‌లలో షేర్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్  సందర్భంగా నిజాంబాద్ పరిధిలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఏర్గట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సంధ్య పోలింగ్ డ్యూటీలో ఉన్న సమయంలో పేపర్ బ్యాలెట్లు స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియా స్టేటస్‌లలో షేర్ చేసి  ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రక్రియ అనేది అత్యంత గోప్యతతో, నియమావళి కట్టుదిట్టంగా అమలు కావాల్సిన ప్రక్రియ. ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోలింగ్ స్టేషన్‌లో బ్యాలెట్ పత్రాలు లేదా ఓటింగ్ ప్రక్రియను ఫోటోలు తీయడం నిషేధితం.అలాంటి సున్నితమైన సమయంలో బ్యాలెట్ పత్రాలు బహిరంగంగా దర్శనమివ్వడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పోలింగ్ కేంద్రం ప్రచార వేదిక కాదు, బాధ్యతల వేదిక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎలక్షన్ విధులు నియమించే ముందు విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు ప్రతీ ఎలక్షన్స్  కి ముందు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు వారి సర్వీసులో ఎన్నో ట్రైనింగ్లు తీసుకొని అనుభవజ్ఞులై ఉన్నప్పటికీ  ఇలాంటి సిబ్బంది అత్యుత్సాహం, నిర్లక్ష్యం కారణంతో  ఇలాంటి సంఘటనలు వ్యక్తమవుతున్నాయి. బ్యాలెట్ పేపర్లు బయట ప్రపంచానికి కనబడేలా ఫోటోలు తీయడం ఎన్నికల గోప్యతను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామని రాజకీయ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఎన్నికల సమయంలో ప్రతి అడుగు నియమావళికి లోబడి ఉండాలి. చిన్నపాటి తప్పిదం కూడా ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది అని హెచ్చరిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply