Mulugu | ఘనంగా హేమాచలుడి వరపూజ..

Mulugu | ఘనంగా హేమాచలుడి వరపూజ..

Mulugu, మంగపేట, ఆంధ్రప్రభ : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలో హేమాచల క్షేత్రం ( మల్లూరు గుట్ట ) పై కొలువై ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి వరపూజ ( నిశ్చయ తాంబూల స్వీకరణ ) కార్యక్రమం అశేష భక్తజన సందోహం మధ్య గురువారం రాత్రి మండలంలోని మల్లూరు గ్రామంలోని రామాలయం సమీపంలోని సంక్రాంతి మండపం వద్ద కన్నుల పండువగా జరిగింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్య కాలంలో సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకుని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు గురువారం రాత్రి 7 గంటల నుండి 8.20 గంటల వరకు ప్రవరా పూజా కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీ హేమాచల లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, తిల తైలాభిషేకం, సహస్రనామార్చనలు నిర్వహించి, స్వామి వారికి మహాభోగ కైంకర్యాదులను నిర్వహించారు.

సాయంత్రం స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక సేవ ( పల్లకి ) పై మంగళ వాయిద్యాలు, భక్తీ సంకీర్తనల నడుమ మల్లూరు గ్రామంలోని సంక్రాంతి మడపం వద్దకు తీసుకువచ్చారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవ విగ్రహాలను మల్లూరు గ్రామంలోని రామాలయం సమీపంలోని సంక్రాంతి మండపం పై ఉంచారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.మహేష్ పర్యవేక్షణలో వరపూజ కార్యక్రమ నిర్వాహక పూజారులు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారా చార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకటనారాయణ శర్మ (బాబీ), రాజీవ్ శర్మ, మురళీ ఆచార్యులు తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవ సుముహూర్తం 2026 మే 1వ తేదీగా నిర్ణయించారు. చెంచు లక్ష్మి అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి, ఆరాధించే మండలంలోని చుంచుపల్లి గ్రామంలోని ఆదివాసీ గిరిజనులు ఆనవాయితీగా చెంచులక్ష్మి అమ్మవారితో పాటు ఆదిలక్ష్మి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ, చీర, జాకెట్, గాజులు, రాస గుమ్మడి కాయలను సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. గురువారం రాత్రి నిర్వహించిన స్వామి వారి నిశ్చితార్థం కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో మల్లూరు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. హేమాచలుడి వరపూజ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగపేట ఎస్సై టి.వి.ఆర్.సూరి ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్త్ నిర్వహించారు.

Leave a Reply