MS Raj Thakur | క్రిస్మస్ శాంతి–సోదరభావానికి ప్రతీక

MS Raj Thakur | క్రిస్మస్ శాంతి–సోదరభావానికి ప్రతీక
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్
క్రైస్తవ మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట
28చర్చిలకు రూ.30వేల చొప్పున ఆర్థిక సహాయం : రాష్ట్ర ప్రభుత్వం
MS Raj Thakur | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, ప్రేమ, సోదరభావం వంటి మహనీయ విలువలను చాటిచెప్పే గొప్ప పండుగ అని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ (MS Raj Thakur) పేర్కొన్నారు. మత సామరస్యం, ఐక్యతతోనే సమాజం ముందుకు సాగుతుందన్నారు.
క్రిస్మస్ పండుగ (Christmas festival) సందర్భంగా గోదావరిఖని కల్వరి చర్చ్, సిఎస్ఐ చర్చ్‌లలో ఇవాళ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కూడా కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈసందర్భంగా క్రైస్తవ మత పెద్దలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) ప్రార్థనలు చేసి ఆశీర్వాదం అందించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే, అన్ని మతాలను గౌరవించుకోవడమే భారతీయ సంస్కృతి ప్రత్యేకత అని, ప్రతి పండుగను అన్నివర్గాల ప్రజలు కలిసి జరుపుకోవడం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజున జరుపుకునే పండుగ క్రిస్మస్ అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) లో క్రైస్తవ మైనారిటీలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రామగుండం (Ramagundam) నియోజకవర్గంలో ఉన్న సుమారు 28 రిజిస్టర్డ్ చర్చిలకు ఒక్కో చర్చికి రూ.30వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
