TG | నాజోలికి వస్తే ఊరుకోను.. : ఎమ్మెల్సీ కవిత

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌పై పూర్తి విధేయతను ప్రకటించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు ఎదురైన అనుభవాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నా ఫీడ్‌బ్యాక్‌ను లీక్ చేశారు..
పార్టీలోని కొందరు నేతల ప్రవర్తనపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే కూడా నాయకులెవరూ స్పందించకపోతే ఎలా?” అని ఆమె ప్రశ్నించారు. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని, వారు తనకు నీతులు చెబుతున్నారని ఆరోపించారు. “నా మీద పడి ఏడిస్తే ఎలా?” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని, దాన్ని అరికట్టమని కోరితే, పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనపైనే విమర్శలు చేయిస్తున్నారని కవిత మండిపడ్డారు. “ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా?” అని ఆమె నిలదీశారు.

కుట్రపూరితంగా నన్ను ఓడించారు..
గతంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను కూడా కవిత ప్రస్తావించారు. లిక్కర్ కేసు వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు తాను పదవికి రాజీనామా చేస్తానని చెప్పగా, కేసీఆర్ వద్దని వారించారని తెలిపారు. అంతేకాకుండా, తాను ఎంపీగా పోటీ చేసిన సమయంలో పార్టీలోనే కొందరు కుట్రపూరితంగా తనను ఓడించారని సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కవిత స్పష్టం చేశారు. “కేసీఆర్‌ మాత్రమే నాకు నాయకుడు” అని ఆమె దృఢంగా ప్రకటించారు.

బీజేపీలో కలపాలని చూస్తున్నారు..
బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపాలని కొంతమంది చూస్తున్నారని కవిత ఆరోపించారు. బీజేపీలో విలీనం చేయవద్దని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పానని ఆమె తెలిపారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply