కౌన్సిలర్ రేసులో వీరు…చైర్మన్ అయ్యేది ఎవ్వరు …?

కౌన్సిలర్ రేసులో వీరు…చైర్మన్ అయ్యేది ఎవ్వరు …?
- జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ మహిళల పోటీ
- పోటీలో 12 మంది ఎస్సి మహిళలు
- కాంగ్రెస్ 3, బి ఆర్ ఎస్ 3, బీజేపీ 2 ,స్వతంత్ర 4 గురు చొప్పున బరిలో…
- 2 వ వార్డులో అత్యధికంగా 5 గురు మహిళలు పోటీలో..
- చైర్మన్ అభ్యర్థులను ప్రకటించని ప్రధాన పార్టీలు..!
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాస్త.. ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో మోత్కూర్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో కేవలం 2,6 వ వార్డులు మాత్రమే ఎస్సీ మహిళ,ఎస్సీ జనరల్ స్థానాలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో జనరల్ స్థానాల్లోనూ సైతం ఎస్సీ మహిళలు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపితో పాటు మరి కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా ఆయా వార్డులలో కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 2 వ వార్డులో ఎస్సీ మహిళ స్థానంలో.. కురిమిళ్ళ ప్రమీల (కాంగ్రెస్) , మర్రి మరియమ్మ( బిఆర్ఎస్), పత్తి ఉమా మహేశ్వరి( బిజెపి),చింత గాయత్రి గణేష్(స్వతంత్ర), బోయినపల్లి లక్ష్మి( స్వతంత్ర) 5 వ వార్డు జనరల్ మహిళ స్థానంలో… కోక రేణుక బిక్షం (బిఆర్ఎస్) 6 వ వార్డు ఎస్సీ జనరల్ స్థానంలో… గడ్డం స్వప్న ( కాంగ్రెస్),కందుకూరి నవనీత (బీజేపీ), 12వ వార్డులో మెంట రమణ నగేష్ (కాంగ్రెస్) కూరెళ్ళ పద్మ పరమేష్( బిఆర్ఎస్), కూరెళ్ళ సువర్ణ (స్వతంత్ర), మెంట జయమ్మ (స్వతంత్ర) అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మొత్తం 12 మంది ఎస్సి మహిళలు ..చైర్మన్ పదవి పై ఆశతో కౌన్సిలర్ బరిలో ఉన్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక వేళ ఓటమి పాలైతే …స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు కీలకం కానున్నారు. ఈ ఆశతోనే కాంగ్రెస్ పార్టీ 2,6,12 వార్డుల్లో ముగ్గురు ఎస్సి మహిళలకు పార్టీ బి ఫామ్ లు ఇవ్వగా…బి ఆర్ ఎస్ పార్టీ మాత్రం 2,5,12 వార్డుల్లో ముగ్గురు ఎస్సి మహిళ అభ్యర్థులను బరిలోకి దింపారు.బీజేపీ తరపున సైతం ఎస్సి రిజర్వ్ స్థానాలు (2,6 వ వార్డులు) మాత్రమే ఇద్దరు ఎస్సి మహిళలను బరిలో దింపారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు 8 మంది పోను మినహా 4 గురు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా 2,12 వ వార్డులలో బరిలో దిగారు.ఎవరు కౌన్సిలర్ గా గెలుస్తారో…ఎవరు చైర్మన్ పీఠం అధిరోహిస్తారో ….ఓటర్ల నాడి సైతం అంతుచిక్కడం లేదని మున్సిపల్ ప్రజలు,రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

చైర్మన్ అభ్యర్ధిని ప్రకటించని పార్టీలు….
చైర్మన్ రేసులో ఉన్న వారిని ఓటమి పాలు చేసేందుకు కుయుక్తులు
మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ కాస్త ఎస్సి మహిళకు రిజర్వ్ కావడంతో …ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బి ఆర్ ఎస్,బీజేపీ లు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు.గతంలో చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ముందస్తుగా చైర్మన్ అభ్యర్థులను కాంగ్రెస్ ,బి ఆర్ ఎస్ పార్టీలు ప్రకటించాయి.ఈ దఫా ఎస్సి మహిళకు చైర్మన్ అవకాశం రావడంతో …ఆర్ధిక భారం,చైర్మన్ అభ్యర్థి ఓటమికి కుయుక్తులు పన్నే అవకాశం ఉండడంతో చైర్మన్ అభ్యర్థుల ప్రకటనలో ప్రధాన పార్టీలు వెనుకంజ వేశాయి. ఎవ్వరు కౌన్సిలర్ గా గెలిచి వస్తారో …వేచి చూసిన అనంతరమే.. చైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని కౌన్సిలర్ సీట్లు వస్తాయోనని ఆయా పార్టీల నాయకులు తమ తమ అంచనాల్లో ఉన్నారు.మరో 2 రోజులు గడిస్తే గానీ ఓటర్ల నాడీ తెలిసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో ..వేచి చూడాల్సిందే.



