సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పరిటాల సునీత
Cmrf |(అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో) : రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆమె పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మొత్తం 27మందికి రూ.17.50లక్షలు (ఎల్ఓసి తో పాటు) మంజూరు కాగా వారిలో 19మందికి 12లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అనంతపురం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కష్ట కాలంలో తమకు ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి వైద్యం అందాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు తాజాగా చర్యలు చేపట్టిందని వివరించారు. మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో పూర్తిచేసి అన్ని వర్గాలకు వైద్యం వైద్య విద్య అందించాలని చూస్తోందన్నారు. కానీ వైసీపీ దీనిపై కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా మెడికల్ కళాశాలలో పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారన్నారు. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మబోరని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు.

