ఎమ్మెల్యే బత్తుల భరోసా..

సీతానగరం, ఆంధ్రప్రభ : తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో మంగళవారం రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. తుఫాను తీవ్రత, ముంపు పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముఖ్యంగా, సీతానగరం మండలం ముగ్గుళ్ళ గ్రామంలోని పలు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ తుఫాను తీవ్రత దృష్ట్యా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని కోరారు. అనంతరం పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ బాధితులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు సరిగా అందుతున్నాయా లేదా అని నిర్ధారించుకున్నారు.

అధికారులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం అలసత్వానికి తావివ్వకుండా, అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ తగిన సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు అందించే ఆహార పదార్థాలు, ఇతర ప్రాథమిక సౌకర్యాల విషయంలో చొరవగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాలని అధికారులను కోరారు. ఈ పర్యటనలో సీతానగరం ఎమ్మార్వో శ్రీనివాస్, కోరుకొండ సిఐ సత్య కిషోర్, సీతానగరం ఎస్ఐ రామ్ కుమార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply