అల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం..

అల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం..
విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : ఉమ్మడి విశాఖలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి 11:00 దాటిన తర్వాత భూమి కంపించింది. అయితే.. స్వల్పంగానే ప్రకంపనల తీవ్రత ఉంది. ఇక అల్లూరి జిల్లా అరకువేలి, పాడేరు, పెదబయలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 30 సెకెన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక నిద్రిస్తున్నవారు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే.. ఆ తరువాత అంతా సద్దుమగడంతో చాలా సేపు గిరిజనులంతా బయటే ఉండిపోయారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా భూమి కంపించడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు.
కొన్ని ఇళ్లల్లో సామాన్లు కూడా క్రింద పడిపోయాయి. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. అయితే ఈ ప్రకంపనలపై అధికారులు జిల్లా కలెక్టరేట్ కి సమాచారం అందించారు. రెండు రోజులుగా దేశంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపిస్తుండటంతో.. ఎప్పుడు ఏ ప్రాంతంలో భూమి కంపిస్తుందోనని అంతా భయపడుతున్నారు. అయితే శనివారం రాత్రి ఈ ప్రకంపనలు రావడంతో అక్కడే బస చేసి ఉన్న కొందరు పర్యాటకులు కూడా భయాందోళనకు గురయ్యారు.
