కాంట్రాక్టర్ తో జర భద్రం

కాంట్రాక్టర్ తో జర భద్రం
( ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : మీ ఇలాఖాలో అకృత్యాలు జోరుగా.. హుషారుగా సాగిపోతున్నాయండి. మీరేమో ఊళ్లను బాగు చేయాలని తపిస్తుంటే… కాంట్రాక్టర్లు (Contractors) మాత్రం దొరికిన పనిని దొరికినట్టు ఆరగించేస్తున్నారు. సరీగా.. 11 మాసాల కిందట అంటే అక్టోబర్ 15న మీరు, ఎంపీ బాలశౌరి కలసి.. ప్రధాని సడక్ యోజన పథకంలో పోతిరెడ్డిపాలెం నుంచి పెదపట్నం శివారు గొల్లగూడెం (Gollagudem) వరకూ ఓ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తమ గ్రామాల నుంచి కొత్త రోడ్డు వేస్తున్నారని,, పొట్లపాలెం, కొత్తపూడి, శిరివెళ్లపాలెం, కంసాలిపాలెం, జొన్నలవారి మోడీ గ్రామాల ప్రజలు సంబంరం చేసుకున్నారు. మంగినపూడి, చిలకలపూడి రోడ్డుకు ప్రత్యామ్నయంగా తమ గ్రామాల మీదుగా మరో రోడ్డు వస్తోందని ఈ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ రోడ్డు నిర్మాణానికి రూ.6.34 కోట్ల మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కానీ పని ప్రారంభం కాలేదు. ఎప్పటికైనా ఈ రోడ్డు మాత్రం నిర్మిస్తారని జనం ఆశగా చూస్తుంటే.. ఇటీవలే కాంట్రాక్టరు ప్రత్యక్షమయ్యాడు. చక్కగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాడు. ఇక్కడే మరో తిరకాసు తెరమీదకు వచ్చింది. పొట్లపాలెం నుంచి పోతిరెడ్డిపాలెం (Pothireddypalem) వరకూ అకస్మాత్తుగా రోడ్డు చిక్కి పోయింది. ఇంజనీరింగ్ శాఖ (Engineering Department) అధికారుల ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పు 8 మీటర్లు కాగ.. మన కాంట్రాక్టరు మాత్రం 3.5 మీటర్లే ఖాయం చేశాడు. రామరాజు పాలెం నుంచి మంగినపూడి వరకూ ఉన్న ఈ పంటకాలువకు కనీసం సెట్ బ్యాక్ ఇవ్వకుండా రోడ్డు ఖరారు చేశారు.

పొట్లపాలెం (Potlapalem) దగ్గర ఈ కాలువపై చిన్న వంతెన ఉంది. అలాగే.. ఈ కాలువ వెంబడి కొత్తపూడి వరకూ .. కాలువ గట్టునూ రోడ్డు మార్జిన్ లో కలిపేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఈ పని ఇంతే అని సమాధానం ఇస్తున్నారు. అసలు ప్లాన్ ఇచ్చిందెవరు? జరుగుతున్న పనిని పర్యవేక్షిస్తున్నదెవరు? కాలువ గట్టు వెంబడి రిటైనింగ్ వాల్ లేకుండా రోడ్డు నిర్మిస్తే.. ఆ రోడ్డు మనుగడ ఏంటీ? వర్షాకాలం మట్టి కాలువలోకి జారిపోదా? ఈ రోడ్డులో వెళ్లే వాహనాలు కాలువలోకి బోల్తా కొట్టవా? ఇదే జరిగితే,, ఏదో కేంద్రం నిధులు మంజూరు (funds Grant ) చేసింది, ఆ పనిని మమ అనిపించి.. కమీషన్లు పంచుకున్నారనే అపవాదు వస్తే… సహించగలమా? సార్.. కాస్త ఆలోచించండి. ఈ రోడ్డు ప్రజలకు, రైతులకు చాలా అవసరం. ఒక వైపు పోర్టు నిర్మాణం జరుగుతోంది, ఇప్పుడిప్పుడే ఈ గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. కానీ ఇలాంటి నాసిరకం పనులు చేస్తే.. మీరు చేసిన అభివృద్ధి మట్టికొట్టుకుపోతుంది. ఓ సారి ఆలోచించండి సార్.. ఇదీ ఈ ఆరు గ్రామాల జనం ఘోష.
