Mangalagiri | అధికారులకు మంత్రి నారా లోకేష్ స్వీట్ ఛాలెంజ్

మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వంద రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరి (Mangalagiri) ని తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (Tadepalli Municipal Corporation) ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు.

చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ (Refuse Compactor Machine) వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ (Sweeping machine) వాహనాలతో పాటు బీటీ రహదారులు గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనున్నారు.

ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్‌ను అధికారులు స్వీకరించాలన్నారు. వంద రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఛాలెంజ్ ను తాము స్వీకరిస్తున్నామని, స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1 తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.

Leave a Reply