AP | వీర జవాన్ శవ పేటికను మోసిన మంత్రి నారా లోకేష్

శ్రీ సత్యసాయి బ్యూరో, మే 11 (ఆంధ్రప్రభ): భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన యుధ్ధంలో కాశ్మీర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళి నాయక్ అనే అగ్ని వీరుడు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీలోని తల్లి తండాకు చెందిన మురళి నాయక్ అంత్యక్రియలు ఆదివారం కల్లితండాలో అధికార లాంచనాలతో నిర్వహించారు.

అంత్యక్రియలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వి.అనిత, మానవ వనరుల శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, ఎమ్మెస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తదితరులు హాజరయ్యారు.

ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ జవాన్ మురళి నాయక్ శవ పేటికను కళ్లి తండాలోని మురళి నాయక్ ఇంటి నుంచి సమీపంలో వారి సొంత పొలంలో ఏర్పాటు చేసిన అంత్యక్రియల గుంతవరకు సైనికులతో పాటు మోశారు. అనంతరం అంత్యక్రియల సందర్భంగా చివరిసారీగా మురళి నాయక్ పార్థీవదేహానికి సైనిక వందనం చేశారు.

కేంద్ర, రాష్ట్ర పోలీసులు, సైనికులు మంత్రి లోకేష్, హోంమంత్రి వి.అనితకు పుష్పగుచ్చం అందజేయగా, వారు మురళి నాయక్ శవపేటికపై ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు నారా లోకేష్, అనిత, సవిత, సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, తదితరులు మురళి నాయక్ అంత్యక్రియలు ముగిసే వరకు ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంత్యక్రియలకు గంట ముందుగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *