Minister | చీడపురుగును తరిమికొడదాం..

Minister | చీడపురుగును తరిమికొడదాం..
- రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తే ఊరుకోం
- కఠిన చర్యలు తీసుకుంటాం
- రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
Minister | ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : రాష్ట్రంలోని చీడపురుగు తరిమికొడదామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి ఎలాంటి హత్యారాజకీయాలు చేశారో అందరికీ తెలుసునన్నారు.
తోట చంద్రయ్యను నడిరోడ్డుపై చంపారని, జల్లయ్య లాంటి బలహీనవర్గాల వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. పదవ తరగతి విద్యార్థి అమరనాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగలపెట్టినా గత ప్రభుత్వం వదిలేసిందన్నారు.
తమ ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఏది జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. పల్నాడులో జరిగిన వ్యక్తిగత గొడవను రాజకీయ గొడవగా మార్చారని జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు చూస్తున్నారని తెలిపారు. అంత్యక్రియలు సైతం రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేశామని తెలిపారు.
తిరుపతిలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లి అక్కడ దుర్మార్గం చేయాలని చూశారని, క్యూ లైన్లో వీడియోలు తీయటం. ఆవులు చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఫాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌లో చనిపోతే మతాల మధ్య వైషమ్యాలు పెంచేలా గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు.
గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అందలం ఎక్కించారని, చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లిన వారికి పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి విష సంస్కృతిని ప్రోత్సహించారని, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తే ఊరుకోమన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఏదో విధంగా గొడవలు సృష్టించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని, అది ఈ ప్రభుత్వంలో కుదరదని తెలిపారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.
