ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు (శనివారం) అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
కాగా, ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటన్స్ తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది.
గెలుపే లక్ష్యంగా..
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కూడా ఓటమి పాలైంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్లు తమ తొలి విజయాన్ని లక్ష్యంగా చేసుకుని సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ పోరు రసవత్తరంగా మారనుంది.
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..
స్లో ఓవర్ రేట్ నిషేధం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గతంలో ఆ ఫ్రాంచైజీని నడిపించిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఆ జట్టుకే వ్యతిరేకంగా ఆడనున్నాడు.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, సత్యనారాయణ రాజు, ముజీబ్ ఉర్ రెహమాన్, ట్రెంట్ బౌల్ట్.
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.