MEXICO | రైలు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

MEXICO | రైలు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
- మెక్సికోలో దుర్ఘటన
- మరో 98 మందికి గాయాలు
- నిజాండాలో పట్టాలు తప్పిన రైలు
MEXICO | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మెక్సికోలో రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 98 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 250 మంది ప్రయాణికులు ఉన్నారు. సుమారు 250 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బందితో ఈ రోజు (మెక్సికోలో ఆదివారం) బయల్దేరిన ఇంటర్ఓ షియానిక్ ప్యాసింజర్ (Passenger) ఒక్సాకాలో నిజాండా వద్ద పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పిందని సమాచారం అందుకున్న మెక్సికన్ ఆర్మీ, సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీశారు. వారిలో 139 మంది సురక్షితంగా బయటపడ్డారని, 98 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

రైలు ప్రమాదంపై మెక్సికో ప్రెసిడెంట్ (President of Mexico) క్లాడియా షిన్బామ్ పార్డో విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ఉన్నతాధికారులను ఘటనాస్థలికి పంపించినట్లు పేర్కొన్నారు. రైలు ప్రమాదంపై ఓక్సాకా గవర్నర్ సాలోమన్ జారా క్రూజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి సహాయక చర్యలు, వైద్య సేవలు సమన్వయం చేసుకుంటామని తెలిపారు. రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని మెక్సికో అటార్నీ జనరల్ ఎర్నేస్టినా గోడోయ్ రామోస్ తెలిపారు.
