తాత అంత్యక్రియలకు వెళ్తూ…

తాత అంత్యక్రియలకు వెళ్తూ…
మనుమని మృతి..
గుండెపోటుకు గురైన యువకుడు..
జన్నారం, ఆంధ్రప్రభ : వరుసకు తాత అంత్యక్రియలకు వెళ్తున్న మనమడు గుండెపోటుకు గురై మృతి చెందిన విషాదకర సంఘటన ఇది.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్ కు చెందిన సంకపాగ దేవన్న(35) గురువారం ఉదయం గుండె పోటుకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు స్థానిక ఓ మెడికల్ స్టోర్ లో పనిచేస్తున్నారు. స్థానిక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి సంకపాగ నర్సింగ్ రెండు కుమారుడు దేవన్న కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం కప్పర్ల గ్రామానికి అమ్మ చిన్న నాన్న డి.చిన్నరాజన్న చనిపోగా అంత్యక్రియలకు ఉదయం బస్సులో బయలుదేరారు.
కప్పర్లలో చనిపోయిన చిన్న రాజన్న వరుసకు దేవన్నకు తాత అవుతాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ చేరుకోగానే దేవన్నకు చాతిలో నొప్పి వస్తుందని చెప్పగానే అక్కడే బస్సు దిగారు. వెంటనే అక్కడి నుంచి వేరే బస్సులో తిరిగి పొనకల్ కు వచ్చి ఆ తర్వాత ఓ వాహనంలో లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దేవన్న మార్గమధ్యలో మృతి చెందాడు.మృతునికి భార్య వసంత ఉంది.ఇంకా పిల్లలు కలగలేదు. మృతుని అంత్యక్రియలు పొనకల్ లో నిర్వహించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
