మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..?

మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..?
ఈసారైనా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారా? లేదా?
రాప్తాడు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో అధిక వర్షాలు కురవడం వలన కొనుగోలు కేంద్రాలు లేకపోవడం జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయామని ఈ రభీ సీజన్ లో అయినా మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి మండలంలోను ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2400 మద్దతు ధర అమలు చేయాలని కోరుతున్నారు.
గడిచిన ఖరీఫ్ సీజన్ ఆఖరులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మొక్కజొన్న పంట కొనుగోలు చేస్తామని మద్దతు ధర కల్పిస్తామని ప్రకటించారు. కానీ అమలు కాలేదు. ఈ రభీ సీజన్ లో అయినా అమలు అవుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. అయినా కానీ ఇప్పటికి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం గాని ప్రకటన గాని విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో మొక్కజొన్న మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తున్నారు.
కానీ మన రాష్ట్రంలో కొన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గడిచిన ఖరీఫ్ లో అధిక వర్షాలకు తోడు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మధ్య దళారుల దోపిడీ వల్ల జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యారని రైతులు వాపోయారు. ప్రస్తుత రబీ సీజన్ లో సకాలంలో యూరియా దొరకక పోవడం అధిక ధరలకు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొని ఎకరాకు 40 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ప్రస్తుతం మధ్య దళారులు సిండికేట్ గా మారి మొక్కజొన్నలు క్వింటాలు కేవలం రూ.1600 రూ 1750 రూపాయలకే కొనుగోలు చేయడం వల్ల కనీస పెట్టుబడి కూడా రాక తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన జిల్లాలోని మొక్కజొన్న పండించిన రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారు. కావున జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం మొక్కజొన్నలు కొనుగోలు చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
