బాండు పేపర్ పై మేనిఫెస్టో (హామీలు).. బాధ్యతగా పని చేస్తా..

బాండు పేపర్ పై మేనిఫెస్టో (హామీలు).. బాధ్యతగా పని చేస్తా..
- 1 వ వార్డులో హామీ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పరశురాములు
- స్వయంగా రెఫరండం ప్రకటించుకున్న అభ్యర్థి
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలోని 1 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షులు గుమిడేల్లి పరశురాములు రూ. 100 బాండ్ పేపర్ పై తన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో (హామీలు) ప్రకటించి జిరాక్స్ పత్రాలను ఇంటింటికి తిరిగి పంచుతూ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే 5 సంవత్సరాల కాల పరిమితిలో తనకు వచ్చే జీతభత్యాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ ,బ్యాగులు,పెన్నులు, మౌలిక వసతుల కోసం వెచ్చిస్తానన్నారు.
కౌన్సిలర్ పదవి గడిచిన రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ మేరకు తన సేవ నచ్చకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని రెఫరండం ప్రకటించారు. పదవి కాలంలో తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడనని … వార్డు ఓటర్ల నుండి ఎలాంటి డబ్బులు ఆశించనని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే… తాను ప్రశ్నించే గొంతుకను అవుతానన్నారు. తన హామీలను నచ్చి ఒక్కసారి తనకు అవకాశం కల్పించి ఈనెల 11న జరిగే ఎన్నికల్లో తన ఎయిర్ కండిషన్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

