జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునేలా సభ నిర్వహించాలి..
పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయాలి
విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నపవన్ కల్యాణ్
మంగళగిరి – ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగినఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు.. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు.. జనసేనలో చాలా మంది పదవులు కోసం ఆశిస్తున్నారు.. పదవులు కోసమే ప్రయాణం చేయకూడదు అని మంత్రి మనోహర్ సూచించారు.
ఇక, జనసేన తరపున ఇంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉంటారని అనుకోలేదు అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పండగ వాతావరణంలో గర్వంగా సభ జరుపుకోవాలి.. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయాలి అని సూచించారు. అలాగే, అధికారం దుర్వినియోగం చేసి వ్యవస్థలను వారి స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళని చట్టం శిక్షిస్తుందన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడ్డ వారు ఇచ్చిన కంప్లైంట్ పై ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుంది.. రాబోయే రోజుల్లో కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని మంత్రి మనోహర్ హెచ్చరించారు