ఓదెల, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేస్తుంది. బుధవారం దర్శనానికి వచ్చిన భక్తుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోవడంతో ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్, పోలీస్ సిబ్బంది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.
అప్పటికప్పుడే సదరు భక్తుడికి సీపీఆర్ చేసిన పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ వెంటనే తమ పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించాడు. భక్తుడు ఒర్సు శ్రీనివాస్ ది వీణవంక మండలం చల్లూరు గ్రామంగా తెలిసింది. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. భక్తుడు గుండెపోటుకు గురి కావడంతో అప్పటికప్పుడే స్పందించి ప్రాణాలు కాపాడిన ఎస్సైరమేశ్, పోలీస్ సిబ్బందిని భక్తులు, ప్రజలు అభినందించారు.