KTR | దమ్ముంటే.. ఆ 10 మందితో రాజీనామా చేయించు..

KTR | దమ్ముంటే.. ఆ 10 మందితో రాజీనామా చేయించు..
- అమ్ముడు పోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమాగం..
- పదవుల కోసం ఇంత దిగజారుతారా..?
- ఐదు నిమిషాల్లోనే మాట మార్చిన రేవంత్..
- 66 శాతం నమ్మకముంటే ఎన్నికలకు రండి..
- పంచాయితీ ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్పారు..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. నైతికత కలిగి ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలాలంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు.
హైదరాబాద్ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ, సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారన్నారు.
Phone Tapping | ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు
నిజంగానే 66 శాతం ప్రజాధరణ ఉంటే తన సవాల్ స్వీకరించాలని, మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. గతంలో మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కేవలం గడ్డిపోచలాంటి పదవుల కొ సం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయన్నారు. సీఎం ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారన్నారు. బయట కాంగ్రెస్ లో చేరామని చెప్పి, స్పీకర్ ముంగటకు పోయి తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు.
ఆటలో అంపైర్ గా ఉండాల్సిన స్పీకర్ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పక్కన పెట్టి సీఎం చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.
Winter Season | రైతులూ.. సూచనలు పాటించండి
అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో 117 పంచాయతీలకు గాను 80 చోట్ల బీఆర్ఎస్ గెలవడమే దీనికి నిదర్శనమన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారన్నారు.
పల్లెలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారఅని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బెదిరింపులకు, ఫోన్ కాల్స్ కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలని, వచ్చే ఏడాదిలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటాం. పాత తరం అనుభవం, కొత్త రక్తం కలిసేలా చాకుల్లాంటి పిల్లలతో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని పిలుపునిచ్చారు.

