నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది ఆలయంలోని నాగనంది వసతి గృహాలు కూల్చివేస్తున్న సమయంలో (మంగళవారం) ఇద్దరు వ్యక్తులు మరణించారు. పనులు జరుగుతున్న సమయంలో పెచ్చులు ఊడి కింద ఉన్న వారిపై పడటంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కందికాయ పల్లె సుబ్బరాయుడు (60) అక్కడికక్కడే మృతి చెందగా, వడ్డె వెంకటేశ్వర్లు (50)నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
టీడీపీ నేత బన్నూరు రామలింగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని రామలింగారెడ్డి హామీ ఇచ్చారు.
ఇక మృతులిద్దరినీ పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
