Madalapalli – యాసిడ్ దాడి … నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోండి: చంద్రబాబు
వెలగపూడి : అన్నమయ్య జిల్లాలో నేడు జరిగిన యాసిడ్ దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు.. బాధితురాలికి మెరుగైన వైద్య అందించేందుకు అవసరమైతే బెంగళూరుకి గానీ , విజయవాడకు గాని పంపాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.అలాగే బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత
యాసిడ్ దాడి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి.. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతోనూ మంత్రి ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు.
లోకేష్ ఆవేదన ..
ఇది ఇలా ఉంటే మంత్రి లోకేశ్ సైతం ఘటనపై స్పందించారు. యవతిపై యాసిడ్ దాడి తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు.