లారీ–బైక్ ఢీ.. ఇద్దరు మృతి

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్–ఉడుంపూర్ గ్రామాల మధ్య శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుర్రం మధిర గ్రామానికి చెందిన ఉయికే కుమరం భీమ్‌రావు (25), కొమరం రంభబాయి (45) ద్విచక్రవాహనంపై మండల కేంద్రం కడెంకు బ్యాంకు పనుల నిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు.
అదే సమయంలో ఉడుంపూర్ గ్రామానికి చెందిన ఒక లారీ బిర్సాయిపేట్ సమీపం నుంచి పెంటపెండ (పశువుల ఎరువు) లోడుతో నిర్మల్ వైపు వెళ్తుండగా బైక్ లారీని ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బైక్ లారీ ముందు టైర్ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న కడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
