- హైకోర్టు ఓకే.. నోకే.. అదే మిస్టరీ
- నోటిఫికేషన్ పైనే ఉత్కంఠ
ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి (తెలంగాణ) : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు గురువారం గ్రీన్ సిగ్నల్ వస్తుందా? రాదా? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? ఇదే తెలంగాణ పొలిటికల్ సీన్… క్షణ క్షణం సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తోంది. అయితే, కోర్టు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో, రేపటి నోటిఫికేషన్ విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆ ఉత్కంఠతకు తెరదించుతూ రేపటితో అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు ప్రచారం వైరల్ గా మారింది. ఎందుకంటే.. తొలుత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధతతో ఉన్నారని స్పష్టం చేశారు.
కలెక్టర్లతో సమీక్ష
ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ అంశాలపై సమీక్ష చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ వరకు అన్ని దశల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
శాంతి భద్రతపై దృష్టి
ఈ ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈసీ సూచించింది. ముఖ్యంగా సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించి భద్రతా బలగాలను ముందుగానే మోహరించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో చట్టసంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణ రేపటికి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జరిగిన విచారణ అనంతరం.. ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
50 శాతం రిజర్వేషన్ల పరిమితి..
ప్రస్తుతం, బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం, ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించడానికి అవకాశం లేదు.
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయి. ఈ జీవోలో బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ మొత్తం రిజర్వేషన్ల శాతం 67%గా ఉంది. ఒకవేళ హైకోర్టు ఈ జీవోను కొట్టివేస్తే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే, రేపు వెలువడే హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.