సమష్టిగా మొంథాను ఎదుర్కొందాం : మైలవరం ఎమ్మెల్యే వసంత

ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా : మొంథా తుఫానును సమష్టి కృషితో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లి పట్టణ పరిధిలోని ఎస్టీ కాలనీ, వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసంత బుధవారం పర్యటించారు.

డ్రెయిన్లు పూడిక తీసి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. శాంతి నగర్ శివారులో బుడమేరు డైవర్షన్ చానల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ మొంథా తుఫాను ప్రభావంతో ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కృషి చేసిందన్నారు.

గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకుని వెలగలేరు హెడ్ రెగ్యులేటర్, బుడమేరు డైవర్షన్ ఛానల్ పై నిరంతర నిఘా ఉంచామని చెప్పారు. బుడమేరు నీటి ప్రవాహానికి అడ్డంకి లేకుండా చర్యలు చేపట్టామన్నారు. బీడీసీ ద్వారా వరదనీరు కృష్ణా నదిలో కలుస్తోందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రతిస్పందన బృందాలను (రెస్పాన్స్ టీమ్స్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply