కర్నూలులో మొబైల్ రికవరీ మేళా

కర్నూలులో మొబైల్ రికవరీ మేళా
669 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత
కర్నూలు బ్యూరో, నవంబర్ , ఆంధ్రప్రభ : సైబర్ నేరాల నిరోధక ప్రక్రియలో భాగంగా కర్నూలు జిల్లా పోలీసులు ముందడుగు వేశారు. రికవరీ చేసిన 669 మొబైల్ ఫోన్లను (అంచనా విలువ రూ.1 కోటి 20 లక్షలు) బాధితులకు బుధవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరేడ్ మైదానంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నిందితుల వద్ద నుంచి మన సైబర్ ల్యాబ్ పోలీసులు ఈ మొబైల్స్‌ను రికవరీ చేయగలిగారు. ఇది మూడు నెలల్లో నిర్వహించిన మూడో మొబైల్ రికవరీ మేళా అని తెలిపారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించిన ముఖ్యాంశాలు
మొబైల్ పోయిన వెంటనే http://Kurnoolpolice.in/mobiletheft వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. మొబైల్ రికవరీ సేవ పూర్తిగా ఉచితం; ఎలాంటి రుసుము లేదు. సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో అత్యధిక సంఖ్యలో మొబైల్స్‌ను రికవరీ చేసిన సిబ్బందిని ప్రశంసించారు.
ఉత్తమ సేవలకు గౌరవాలు:
96 మొబైల్స్ రికవరీ చేసిన కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు శేఖర్ బాబు కు,30 మొబైల్స్ రికవరీ చేసిన ఆదోని టూ టౌన్ పి.ఎస్. కు చెందిన నాగరాజుకు, 16 మొబైల్స్ రికవరీ చేసిన ఇస్వి పి.ఎస్. కు చెందిన రామచంద్రకు జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.
రికవరీ అయిన మొబైల్స్ పై బాధితుల ఆత్మీయత
వివిధ ప్రాంతాల్లో తమ మొబైల్ ఫోన్లు కోల్పోయిన ఐదుగురు బాధితులు తమకు తిరిగి అందిన మొబైల్స్ పట్ల పోలీసుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, పిల్లల చదువులకు సంబంధించిన డేటా లేదా ఆర్థిక ఖాతాలు, వ్యక్తిగత వివరాలు తిరిగి లభించడం వారికి అమూల్యమైన అనుభవంగా మిగిలింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, నాగరాజా రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్, సైబర్ టెక్నికల్ టీమ్ పోలీసులు పాల్గొన్నారు.
