కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కార్తీకమాసం సందర్భంగా దేవాలయాలు, నదీ తీర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(District SP Vikrant Patil) సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో భక్తులకు పలు సూచనలు చేశారు. కార్తీక మాసంలో మహిళలు దీపాలను వెలిగించి నదులు, కాలువల్లో వదిలే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భక్తులు కార్తీక పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్తున్నప్పుడు తమ వెంట చిన్నారులు ఉంటే మరింత శ్రద్ధ వహించాలని తెలిపారు.. ముఖ్యంగా ఓర్వకల్‌లోని శ్రీ కాల్వబుగ్గ రామేశ్వర శివాలయం(Sri Kalvabugga Rameswara Shiva Temple), శ్రీ బ్రహ్మగుండేశ్వరం శివాలయం, నందవరం పీఎస్ పరిధిలోని గురజాల గ్రామంలోని శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, ఈ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసు సూచనలు భక్తుల రక్షణకే భక్తులు వాటిని పాటించడమే కాకుండా, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. “ప్రజలు భద్రంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా మేము సహాయ చర్యలు తీసుకుంటాం. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.

