TG | పెద్దలకు అండ – పేదోళ్లకు బండ : రేవంత్ పై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థను ఒక్కటిగా కాకుండా, విభజన ధోరణితో నడుపుతోందని ఆరోపించారు. ముఖ్యంగా చెరువుల వద్ద అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా పేరుతో… పెద్దలకు మినహాయింపు, పేద‌ల‌ ఇళ్లను మాత్రం కూల్చేయడమనే ద్వంద్వ ధోరణిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, సీఎం రేవంత్ స్వయంగా కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి అక్కడ మహల్ నిర్మించారని ఆరోపించారు. రేవంత్ సోద‌రుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ పరిమితిలో ఇంటిని కట్టుకుని జీవిస్తున్నారని పేర్కొన్నారు.

రెవెన్యూ మంత్రి హిమాయత్ సాగర్ వద్ద ప్యాలసుల్లా ఇళ్లు నిర్మించారని, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో గెస్ట్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. కేవీపీ రామచంద్రరావు వంటి పెద్దలు కూడా బఫర్ జోన్‌లో గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారని అన్నారు. అంతేగాక, కొందరు ప్రముఖ బిల్డర్లు ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్‌మెంట్లు నిర్మించుకుంటున్నారని ఆరోపించారు.

ఇవన్నీ ప్రభుత్వానికి కనబడవని ఎద్దేవా చేసిన కేటీఆర్, HYDRAA (హైదరాబాద్ రెగ్యులేటరీ అథారిటీ) కు మాత్రం సామాన్యుల ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయంటూ విమర్శించారు.

తమ ఇళ్లు కూల్చొద్దని నిరుపేదలు చేతులు జోడించినా, హైకోర్టు స్టే ఆర్డర్ చూపించినా ప్రభుత్వం కనికరం చూపడం లేదని మండిపడ్డారు. ఇదంతా ఒక వ్యవస్థను తలకిందులుగా నడిపే ధోరణికి నిదర్శనమని ఆయన ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

Leave a Reply