హైదరాబాద్ : ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతలు దోపిడి సాగిస్తున్నారంటూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ, రైతులని మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ తన ట్వీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టు పేరుతో స్వాధీనం చేసుకున్న భూముల వ్యవహారంలో పలు అన్యాయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్టును రద్దు చేయకుండా, భూములపై కాంగ్రెస్ నేతలు తమ కళ్లుపెట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వారు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారంగా కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నాయకులు తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు దక్కాల్సిన స్థలాలను అతి తక్కువ రేట్లకు బలవంతంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ, ఇది పూర్తిగా అన్యాయం, మోసం అని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు సమర్పించిన రైతన్నల్ని కూడా వదలకుండా దోపిడీ చేయడం కాంగ్రెస్ పార్టీ నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతుల పోరాట ఫలితాలను, వారి హక్కులను చీల్చిపోసేలా వ్యవహరించడాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని హెచ్చరించారు.